Jdñews Vision…
విశాఖపట్నం:: బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను వారి కుటుంబీకులు దానం చేసి ఆదర్శవంతంగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధ్ర ప్రసాద్ పిలుపు నిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్ లో జీవన్ దాన్ ఏపీ ఆధ్వర్యంలో జరిగిన వాక్ థాన్ అన్ ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి చేసిన అవయవదానంతో 8 మంది వివిధ రోగులకు అవసరమైన అవయవాలు అమర్చవచ్చన్నారు. ఇప్పటివరకు 4312 మంది జీవన్ దాన్ ద్వారా వివిధ అవయవాల కోసం ఎదురు చూస్తున్నా న్నారు. గత సంవత్సరం అవయవ దానం ద్వారా 210 మందికి స్వస్థత చేకూరిందన్నారు. వీటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ పధ్ధతిలో అందుబాటులోకి వచ్చిన అవయాలను సమకూరుస్తున్నామన్నారు. శరీరంలో వ్యర్థాలను శుద్ది చేసే కిడ్నీలను చాలా కాపాడు కోవాలన్నారు. తనకు కూడా గతంలో ఎడమ కిడ్నీలో రాళ్ళు వచ్చాయని, తగిన వైద్యం చేయిస్తే తగ్గిందన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 3 లీటర్ల మంచి నీటిని తీసుకుని, మూత్ర విసర్జన సరైన సమయంలో చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖ భ్రత బాగ్చి మాట్లాడుతూ అవయవదానం చేసినప్పుడు ఆయా అవయవాలు సకాలంలో సంబంధిత ఆసుపత్రికి చేరేందుకు వీలుగా తమ పోలీసు శాఖ గ్రీన్ ఛానెల్ అనే అత్యవసర రహదారి రవాణా వ్యవస్థను తాత్కాలికంగా ఏర్పాటు చేసి రోగులకు పూర్తిగా సహకరిస్తామన్నారు. విదేశాల్లో హృదయ రోగులకు కృత్రిమ గుండెను అమర్చి విజయవంతంగా శస్త్ర చికిత్సలు చేశారన్నారు. అలానే పంది గుండెను కూడా మానవులకు అమర్చి చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యా యన్నారు. ఈ విధానాలు మన దేశం లో రావడానికి ఇంకా కొంత సమయం పట్టాచ్చన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ ఇటీ వల విమ్స్ ఆసుపత్రిలో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వ రంగ ఆసుపత్రులు కూడా ప్రయివేట్ ఆసుపత్రు లకు ఏమాత్రం తీసి పోవని నిరూపించామన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ కు సంబంధించి వైద్యులు ఇచ్చే డిక్లరేషన్ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉందని, దీన్ని సులభతరం చెయ్యాల్సి ఉందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా దాదాపు అన్ని ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు ఉచితంగానే చేస్తారన్నారు. అవసరమైన వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద, ఆంధ్రా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యా దేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అవయవ దాన ప్రాధాన్యతను తెలుపుతూ పలు ప్రయివేట్ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది, పలు వైద్య కళాశాలల విద్యార్థులు వైఎంసిఎ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.