విశాఖపట్నం 19 జూన్ : : గత నెల 7.5.2023 ఆదివారం పౌర గ్రంథాలయము లో జరిగిన కర్ణాటక సంగీత గాత్ర కచేరి లో
సుప్రసిద్ధ కర్ణాటక సంగీత కళాకారిణి, “సంగీత భూషణ” “స్వరసుధా కళాప్రపూర్ణ” “సంగీతసుధానిధి”
“సంగీత కళానిధి డా.నేదునూరి కృష్ణమూర్తి పురస్కార గ్రహీత” “విదుషీ”శ్రీమతి గుమ్ములూరి శారదా సుబ్రహ్మణ్యం గారు తన గాత్ర మాధుర్యంతో సంగీత ప్రియులను ఆద్యంతమూ అలరించారు. పలు రాగములు ఆలపించుటలో ఆమె ప్రతిభ ద్విగుణీకృతమైనది.
అమృత వర్షిణి రాగమును ప్రధానముగా తీసుకొని ఆనందఆమృతవర్షిణి కీర్తన సంగీత కచేరీ కి వన్నె తెచ్చింది. తరువాత యమన్ కళ్యాణీ రాగము లో ఆలపించిన కీర్తన సంగీత కచేరీ కి విచ్చేసిన సంగీత ప్రియులను మైమరపించింది.
ఈ కచేరీ కి గాత్రకారిణి గాత్రం నుంచి జాలువారిన ప్రతీ కీర్తనను పలికించుటలొ ప్రముఖ వయోలిన్ విద్వాంసులు శ్రీ. ఎమ్.శ్యామ నీలాద్రిరావు గారు సఫలీకృతులయ్యారు. ఆమె కచేరీ కి మృదంగం మీద శ్రీ. జి.వేంకటరావు గారు, ఘటం మీద శ్రీ.ఎ.ఎస్సార్. కౌండిన్య గారు సహకరించి కచేరీ లో ఆనందామృతవర్షిణిని కురిపించారు. ఈ సంగీత కార్యక్రమం లో, మృదంగం మీద శ్రీ. జి.వేంకటరావు గారు, ఘటం పైన శ్రీ. ఎ.ఎస్సార్. కౌండిన్య గారు చేసిన లయవిన్యాసము ఆద్యంతమూ హర్షధ్వానాలు అందుకుంది. కార్యక్రమానంతరం పలువురు ప్రముఖులు, సంగీత ప్రియులు కళాకారులను సత్కరించారు.